ట్రాఫిక్ పర్యవేక్షణకు యువ ఐపీఎస్ ఆఫీసర్లు..!!

ట్రాఫిక్ పర్యవేక్షణకు యువ ఐపీఎస్ ఆఫీసర్లు..!!

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత బలం చేకూర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత బలం చేకూర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ అవరోధాలకు తాత్కాలిక పరిష్కారాలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలికంగా ఉపయోగపడే స్థిరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కీలక స్థాయిలో పోలీస్ శాఖలో బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా పనితీరు, ఫీల్డ్ అనుభవం ఉన్న యువ ఐపీఎస్ అధికారులను ముఖ్యమైన ట్రాఫిక్ బాధ్యతలకు నియమించింది.

ఈ బదిలీలపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. నగర పాలనను మరింత సమర్థవంతంగా మార్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో మంచి పనితీరుతో పేరు తెచ్చుకున్న యువ, చురుకైన ఐపీఎస్ అధికారులను ట్రాఫిక్ విభాగంలో కీలక స్థానాల్లో నియమించడం ద్వారా అమలు వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Read More కల్ ఖోఢ సర్పంచ్ అభ్యర్థిగా చెక్క లత రాములు నామినేషన్

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని డీజీపీ గుర్తు చేశారు. ఆ దిశగా ఇప్పటికే పలు చర్యలు అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, చట్టాల అమలు మరింత పటిష్టంగా సాగేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఈ తాజా బదిలీలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. కొత్తగూడెం అదనపు ఎస్పీగా పనిచేసిన అవినాశ్ కుమార్‌ను హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీగా నియమించారు. ఉట్నూర్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన కాజల్‌ను హైదరాబాద్ ట్రాఫిక్-II డీసీపీ బాధ్యతలు అప్పగించారు.

అలాగే, జి. చందన దీప్తిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌గా (అడ్మినిస్ట్రేషన్ మరియు ట్రాఫిక్) నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునే ఉద్దేశంతో అభిషేక్ మహంతిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో డీఐజీగా నియమించారు. ఈ నియామకాలతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు చట్ట అమలులో మరింత సమర్థత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.trafficpolice

Tags: