ముస్లిం, మైనార్టీల సంక్షేమం పట్టదా

ముస్లిం, మైనార్టీల సంక్షేమం పట్టదా

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు 

విశ్వంభర, సిద్దిపేట: కాంగ్రెస్ సర్కార్ ముస్లిం మైనార్టీలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీలో ముస్లిం మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే హరీశ్‌రావును పట్టణానికి చెందిన ముస్లిం నాయకులతోపాటు మతపెద్దలు బుధవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రూ.4వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం రూ.3500కోట్లు మాత్రమే పెట్టిందన్నారు. ఇందులో కూడా 1600కోట్లు మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేసిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌ను అత్యధికంగా ఖర్చు చేశామని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఉర్దూ అకాడమీలో పనిచేసే 130మందికి 9నెలల నుంచి జీతాలివ్వడం లేదని మండిపడ్డారు. ఇమామ్, మౌజాన్లకు రూ.12వేల జీతభత్యాలు ఇస్తామని నేటికీ ఇవ్వడం లేదని, ముస్లింలను రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన టిమ్రిస్ పాఠశాలల్లో 1,20,000 మంది విద్యార్థులు చదువుకునేవారని కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రూ.30వేల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు. ముస్లింల సంక్షేమాన్ని చిన్నచూపు చూస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ముస్లింలకు అండగా నిలుస్తుందన్నారు.

Tags: