రిటైల్ చికెన్ వ్యాపారులకు న్యాయం చేయాలి
- : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
విశ్వంభర, ముషీరాబాదు : రిటైల్ చికెన్ వ్యాపారులకు పౌల్ట్రీ సంస్థలు తక్షణమే మార్జిన్ పెంచి న్యాయం చేయాలి, లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బుధవారం తెలంగాణ రాష్ట్ర రిటైల్ చికెన్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రిటైల్ వ్యాపారులపై పౌల్ట్రీ కంపెనీలు అన్యాయం చేస్తున్నాయని, లాభాల కోసం చిన్న వ్యాపారులను నష్టాల్లోకి నెట్టడం సరికాదన్నారు. వ్యాపారులు ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప న్యాయం దక్కదని సూచించారు. అనంతరం తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్న మాట్లాడుతూ… రిటైల్ చికెన్ వ్యాపారులకు తగిన మార్జిన్ ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అద్దెలు, కార్మికుల వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పౌల్ట్రీ కంపెనీలు తక్షణమే స్పందించి వ్యాపారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ… గతంలో ఉన్న మార్జిన్‌ను భారీగా తగ్గించడం వల్ల రిటైల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి. రాజు, వరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



