వరి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
- -జిల్లా కలెక్టర్ హైమావతి
విశ్వంభర, సిద్దిపేట: జిల్లాలో యాసంగిసీజన్‌లో వరి కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. కలెక్టరేట్‌లో వరిధాన్యం సేకరణ, మద్దతు ధర అమలు అంశాలపై డీఆర్డీఓ, సహకార శాఖ, మెప్మా తదితర శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి జిల్లాలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన మంచినీటి సదుపాయం, టెంట్లు, బ్యానర్లు, ప్యాడీ క్లీనర్లు, రిజిస్టర్లు, టార్పాలిన్లు ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్రం బార్డర్ వరకు స్పష్టంగా కనిపించేలా లైటింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూడాలని, రైతులు పండించిన పంటను కల్లాల్లో ఆరబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేల అవగాహన కల్పించాలన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సివిల్ సప్లై అధికారి తనూజ, డీఎం సివిల్ సప్లై అధికారి గోపీకృష్ణ, ఎల్డీయం హరిబాబు, మార్కెటింగ్ అధికారి నాగరాజు, అడిషనల్ డీఆర్డీఏ సుధీర్ బాబు, మెప్మా పీడీ హన్మంత్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



