వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి
-బీడీ కార్మిక సంఘం డిమాండ్
విశ్వంభర, చిన్నచింతకుంట: బీడీ కార్మికుల నూతన వేతన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎఫ్‌టీయూ అనుబంధ తెలంగాణ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీడీ పరిశ్రమ యజమానులకు డిమాండ్ నోటీసు అందజేశారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, బీడీ కార్మికుల వేతన ఒప్పంద గడువు బుధవారంతో ముగిసిందని, గత రెండు సంవత్సరాలలో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగినా కార్మికులకు పాత వేతనాలే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇతర రంగాల కార్మికులకు ప్రభుత్వం కొత్త కనీస వేతనాలు ప్రకటించినప్పటికీ, బీడీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ రంగంలో యువ కార్మికులు చేరడం తగ్గిపోవడంతో వృద్ధులు మాత్రమే ఈ వృత్తిపై ఆధారపడుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతూ కూడా జీవనోపాధి కోసం పని చేస్తున్నారని తెలిపారు. పని మానేసిన లేదా మరణించిన కార్మికుల కుటుంబాలకు చట్టపరంగా ఇవ్వాల్సిన గ్రాట్యూటీ చెల్లించడంలో యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన కార్మికుల డబ్బులు సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయాయని, వాటి పరిష్కారంలో యజమానులు బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు. వెయ్యి బీడీలకు రూ.400 వేతనం, గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయాలి, పీఎఫ్ సమస్యలను యజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. యాదగిరి, జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం. ఖలీల్ ప్రసంగించారు. టీఎఫ్‌టీయూ నాయకులు ఎండి జలాల్ పాషా, పి. రాజేశ్వర్, శంకర్, నేతల రాములు, రవి, శ్రీను, లింగన్న, కుమ్మరి వెంకటన్న, నరసింహ, కృష్ణ, ఎస్తేరమ్మ, రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.



