వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలన చూడడం బిడ్డల బాధ్యత: ఆర్డీవో శ్రీదేవి
విశ్వంభర, చండూరు: గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక గాంధీజీ విద్యాసంస్థల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువైన సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ, సమాజంలో నిజంగా అర్హులైన పేదలను గుర్తించి వారికి నిరంతరంగా సహాయం చేయడం అభినందనీయమన్నారు. దానం చేసే మనసు కొద్దిమందికే ఉంటుందని, 28 నెలలుగా ప్రతి నెలా నిరంతరం సేవలు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత అని, చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని చూసుకున్నట్లే, వృద్ధాప్యంలో వారిని మనం ఆదుకోవాలని సూచించారు. గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 28 నెలలుగా రూ.9 లక్షల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంతో పాటు, పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్, మరణించిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. త్వరలో వాటర్ ట్యాంక్ సెంటర్‌లో చలివేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పులిపాటి రాధిక తదితరులు పాల్గొన్నారు.



