నూతన చట్టం హర్షనీయం
విశ్వంభర, రామన్నపేట: తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాలలో కొంత భాగాన్ని కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టం తీసుకురావడం నిజంగా హర్షించదగ్గ విషయం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి,మాజీ సర్పంచ్ రాపోలు నిర్మలా నరసింహ నేత తెలిపారు. ఇది సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని, పిల్లలపై ఫిర్యాదు చేయాల్సిన స్థితికి తల్లిదండ్రులు వస్తే, వారు ఎంతటి మానసిక వేదన అనుభవించి ఉంటారో సమాజం అర్థం చేసుకోవాలని, అలాంటి వారిని సమాజం నుండి వెలివేయాలనే భావనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యక్తం చేయడం సమాజంలో ఒక సానుకూల మార్పుకు దారితీస్తుందని ఆశించవచ్చని అన్నారు. అయితే, తల్లిదండ్రుల గొప్పతనం ఏమిటంటే, ఎంతటి బాధ వచ్చినా భరిస్తారు, అవసరమైతే ప్రాణాలనైనా త్యాగం చేస్తారు కానీ పిల్లలపై రాతపూర్వక ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం చాలా అరుదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారి చేతిలో కనీస ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు ఇది వాస్తవం. ఈ సమాజంలో చాలా మంది తమ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటున్నారు అనేది నిజమే కానీ కొంతమంది మాత్రం బాధ్యతను విస్మరిస్తున్నారు అనేది కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని తాము కోరేది ఏమిటంటే—2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజి నెంబర్ 34 కాలం నెంబర్ 24లో పేర్కొన్నట్లుగా, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆసరా పెన్షన్ ఇస్తామని చేసిన హామీని అమలు చేయాలని, వృద్ధుల విషయంలో ఎలాంటి షరతులు లేకుండా, అర్హత కలిగిన ప్రతి వృద్ధుడికి దరఖాస్తు ఆధారంగా ఆసరా పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. న్యాయ శాస్త్రంలో అంటారు వందమంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వృద్ధుడు నిరాదరణకు గురికావద్దు కంటనీరు పెట్టొద్దు ఈ కోణంలో ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.



