మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు..|
విశ్వంభర, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు దీర్ఘకాల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సుమారు మూడు దశాబ్దాలపాటు అండర్‌గ్రౌండ్‌లో కొనసాగిన ఆయన, మావోయిస్ట్ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు. ప్రాధమిక సమాచారం ప్రకారం, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, అలాగే కీలక నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయి నట్లు తెలిసింది. ఈ పరిణామం భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా అధికారుల అభిప్రాయం మేరకు, అగ్రస్థాయి నాయకత్వం లొంగుబాటుతో మావోయిస్ట్ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశముంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. సంబంధిత విభాగాలు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో, 2024 డిసెంబర్‌లో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుకన్నా... ఊరు మిన్న” కార్యక్రమం సందర్భంగా బడే దామోదర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఇచ్చిన భావోద్వేగ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. “ఇంటికి రా బిడ్డా” అనే ఆహ్వానం అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానిక వర్గాల అభిప్రాయం ప్రకారం, ఆ పిలుపు ప్రభావం కూడా ఈ నిర్ణయానికి దోహదం చేసి ఉండవచ్చని చెబుతున్నారు. లొంగుబాటు అనంతరం పునరావాస విధానాలు, చట్టపరమైన ప్రక్రియలు అనుసరించనున్నట్లు అధికార వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల ద్వారా ప్రధాన స్రవంతిలోకి చేరేందుకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఇది తోడ్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



