నేను గర్భవతిని సారూ.. నన్ను వదిలేయండి..
- అరెస్ట్ చేయవద్దని ఆశావర్కర్ వేడుకోలు
విశ్వంభర, నిజామాబాద్: ఆశాకార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలని చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో మోర్తాడ్ మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆందోళనలలో ఓ గర్భవతి ఆశావర్కర్ పోలీసులను వేడుకున్న ఉదంతం అందరినీ కలిచివేసింది. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆశావర్కర్లు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చలో హైదరాబాద్‌కు వెళ్లకుండా పోలీసులు ఆశావర్కర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ గర్భవతి అయిన ఆశావర్కర్ వద్దకు పోలీసులు వెళ్లగా, ఆమె తీవ్ర ఆవేదనకు లోనైంది. నేను గర్భవతిని, ప్రస్తుత పరిస్థితుల్లో నేను ధర్నాకు వెళ్లే స్థితిలో లేను, నన్ను వదిలేయండి.. నన్ను అరెస్ట్ చేయవద్దు అని పోలీసులను వేడుకుంది. తన ఆరోగ్య పరిస్థితిని వివరించినప్పటికీ పోలీసులు వినకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. నేను ఎక్కడికీ రాను, ఇంట్లోనే ఉంటాను అని ప్రాధేయపడినా, ముందస్తు జాగ్రత్త చర్యల పేరుతో పోలీసులు ఒత్తిడి తేవడంపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వర్కర్ల పట్ల పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



