సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు 

సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు 

  •  కలెక్టర్ జితేష్ వి పాటిల్

విశ్వంభర, భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో మార్చి 27న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో కదలి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 27న సీతారాముల దివ్య కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, పార్కింగ్ సదుపాయాలు, రద్దీ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు, ఉచిత తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ వంటి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయితీ రాజ్, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసి, ప్రతి విభాగం చేపట్టాల్సిన విధివిధానాలను స్పష్టంగా సూచించారు. మహోత్సవాల నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్న కలెక్టర్, భక్తులకు ఇబ్బందులు కలగకుండా శానిటేషన్, వైద్య, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణమండపం విస్తృతంగా సిద్ధంగా ఉండటంతో అనేకమంది భక్తులు ప్రశాంతంగా సీతారాముల కల్యాణాన్ని వీక్షించవచ్చని తెలిపారు. భక్తులు భద్రాచలం చేరుకుని రెండు మూడు రోజులు ఈ పవిత్ర క్షేత్రంలో గడిపి సమీపంలోని పుణ్యప్రదేశాలను దర్శించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. జిల్లా యంత్రాంగం తరఫున భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు.

Tags: