ఒకే ఇంట్లో ముగ్గురి మృతి
- బాపునగర్‌లో విషాదం
- వ్యాపార నష్టాలే కారణమా?
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యురాలు కద్గేకర్ అమూల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కద్గేకర్ రామరాజ్ (54), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ రాజ్ (27)గా గుర్తించారు. రామరాజ్ మల్లాపూర్‌లోని కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తుండగా, మాధవి గృహిణి. శశాంక్ రాజ్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల వ్యాపార నష్టాల కారణంగా కుటుంబం ఆర్థిక ఒత్తిడిలో ఉందని ప్రాథమికంగా సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అంబర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో బాపునగర్ ప్రాంతం శోకసంద్రంగా మారింది. పొరుగువారు ఇది అత్యంత శాంత స్వభావం గల కుటుంబమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పుడూ బయటపెట్టలేదని చెబుతున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



