రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
- ఎస్పీ రోహిత్ రాజు
విశ్వంభర, కొత్తగూడెం: ప్రమాదాల నివారణకు ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతి పెంపొందాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు కేవలం చట్టపరమైన ఆంక్షలు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి ప్రాణ భద్రతకు రక్షాకవచమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నఅరైవ్ అండ్ అలైవ్ క్యాంపెయిన్ రెండవ విడుతలో భాగంగా మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో విద్యార్థినీ-విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో సబ్‌డివిజన్ పోలీసులు సమన్వయంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ రోహిత్ రాజు హాజరై, యువతకు మార్గదర్శక సందేశాన్ని అందించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 3000 మంది విద్యార్థులు భారీగా హాజరుకాగా, కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ప్రారంభంలో మిమిక్రీ కళాకారుడు రమేష్ తన వినూత్న ప్రదర్శనతో రోడ్డు భద్రతా సందేశాలను వినోదాత్మకంగా అందించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్, వేగ నియంత్రణ వంటి అంశాలపై వివరంగా చర్చించారు. “ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకపోయినా నియమాలు పాటించడం ప్రతి డ్రైవర్ యొక్క నైతిక బాధ్యత. రోడ్డు మీద మన ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి” అని ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌లోడింగ్ వంటి ఉల్లంఘనలు తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వన్‌టౌన్ సిఐ కరుణాకర్, 3 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమణారెడ్డి, ప్రవీణ్, రమాదేవి, విజయ, రాకేష్, విజయసింహారెడ్డి, ఉమ తదితరులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



