సామాజిక అంశాలపై అవగాహన ఉండాలి
- పోలీస్ కమీషనర్ సాయి చైతన్య
విశ్వంభర, నిజామాబాద్: రోడ్డు ప్రమాదాలు నివారించడం, ప్రమాదాలలో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా వారం రోజులపాటు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నిజామాబాదు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక విజయ హై స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నిజామాబాదు పోలీస్ కమీషనర్ .సాయి చైతన్య హాజరై రోడ్డు భద్రత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం సంభవించడం అంటే ఒక కుటుంబం రోడ్డు పాలవడమని ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అవగాహన ముందస్తు జాగ్రత్తలే మార్గమని తెలిపారు. విద్యార్థి దశ నుండే సామాజిక అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల విద్యార్థులు అంబాసిడర్స్ గా ఉండి తల్లిదండ్రులను చుట్టుపక్కల ఉన్న ప్రజలను పెద్దవారిని నిరక్షరాశులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు. పిల్లలు వాహనాలు నడపకూడదని తెలిపారు, తల్లిదండ్రులు, పెద్దలు, హెల్మెట్ ఉపయోగించేలా వారికి తెలియపరచాలన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ పట్టుదలతో కృషి చేయాలని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏ.సీ.పి మస్తాన్ అలీ, ట్రాఫిక్ పీ.స్, ఎస్.హెచ్.ఓ పి .ప్రసాద్ . ఐరాడ్ మేనేజర్ శ్రీ వర్షా నిహాంత్, విజయ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రభాదేవి, సుజాత, వసంత మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



