రోడ్డుభద్రత అవగాహన వారోత్సవాలు
విశ్వంభర,సూర్యాపేట: ముందస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం, ప్రమాదాలలో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఎవిఎం పాటశాల నందు ఈరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ హాజరై రోడ్డు భద్రత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం సంభవించడం అంటే ఒక కుటుంబం రోడ్డు పాలవడమని ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అవగాహన ముందస్తు జాగ్రత్తలే మార్గమని తెలిపారు. విద్యార్థి దశ నుండే సామాజిక అంశాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల విద్యార్థులు అంబాసిడర్స్ గా ఉండి తల్లిదండ్రులను చుట్టుపక్కల ఉన్న ప్రజలను పెద్దవారిని నిరక్షరాశులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు. పిల్లలు వాహనాలు నడపకూడదని తెలిపారు, తల్లిదండ్రులు పెద్దలు హెల్మెట్ ఉపయోగించేలా వారికి తెలియపరచాలన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ పట్టుదలతో కృషి చేయాలని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం నందు హాజరైన పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రమాదాల నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం పాఠశాల యాజమాన్యం, రెండవ పట్టణ ఎస్సై శివతేజ, విద్యార్థులు పాల్గొన్నారు.



