ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం 

ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం 

విశ్వంభర, గాంధీనగర్ : రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని గాంధీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గాంధీనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడిన ఆయన, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. కారు ప్రయాణికులు డ్రైవర్‌తో పాటు అందరూ సీటు బెల్ట్ ధరించడం చట్టబద్ధమైన కర్తవ్యం అని పేర్కొన్నారు. ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎడమ వైపున కాకుండా కుడి వైపు మాత్రమే ముందుకు సాగాలని సూచించారు. ట్రాఫిక్ సంకేతాలను గౌరవిస్తూ, నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడపకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పెంట గౌడ్, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, శివకుమార్, మొహమ్మద్ వాసిమ తదితరులు పాల్గొన్నారు.

Tags: