డైలీ వేజెస్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి
- మార్చి 10న నిరసన
- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్
విశ్వంభర, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) సంఘ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు మాట్లాడుతూ, విద్యారంగం, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిఆర్టీలు మరియు డైలీ వేజెస్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిపాలన, సిబ్బంది, సేవా సంబంధిత సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం అక్టోబర్ చివరి వారంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ప్రత్యక్ష చర్య నోటీసు అందజేసినప్పటికీ, నవంబర్ 15న భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించినప్పటికీ, నవంబర్ 12 మరియు 13 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమాల అనంతరం కూడా చర్చలు జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ పరిస్థితుల్లో రెండవ దశ పోరాట కార్యక్రమాన్ని చేపట్టడం అనివార్యమైందని పేర్కొంటూ, ఈనెల 26న అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు మెమోరాండాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే మార్చి 10న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ ఎదుట రాష్ట్ర స్థాయి నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. సిఆర్టీలు, డైలీ వేజెస్ వర్కర్లకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసి, వారి సర్వీసులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బి. రవి, మండల అధ్యక్షులు కె. వెంకటేశ్వరరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏ. రామచంద్, జిల్లా కౌన్సిలర్ పి. లక్ష్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.



