'అక్షర' బాధితులను ఆదుకోండి

'అక్షర' బాధితులను ఆదుకోండి

  • చిట్‌ఫండ్ మోసాలపై కఠిన చర్యలకు డిమాండ్

విశ్వంభర, ముషీరాబాద్: అక్షర చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ఆర్థిక మోసాలను సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ చిట్‌ఫండ్ కంపెనీల బాధితుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ చిట్‌ఫండ్ కంపెనీల బాధితుల సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆందోళనలో గౌరవ అధ్యక్షురాలు  పశ్య పద్మ , ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ,  వేలాది బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. వరంగల్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా 60కు పైగా బ్రాంచ్‌లతో పనిచేసిన ఈ సంస్థలు 18 శాతం రాబడి పేరుతో ప్రజలను ఆకర్షించి సబ్స్క్రైబర్ల నిధులను ఇతర పథకాల వైపు మళ్లించాయని ఆరోపించారు. నాలుగేళ్లుగా చెల్లింపులు నిలిచిపోవడంతో సుమారు 5 వేల కుటుంబాలు నష్టపోయాయని పేర్కొన్నారు. యాజమాన్యంపై వందకు పైగా కేసులు, అనేక బెయిల్ లేని వారెంట్లు ఉన్నప్పటికీ అరెస్టులు జరగకపోవడాన్ని ఖండించారు. సంస్థకు చెందిన స్థిరాస్తి, చరాస్తులను అటాచ్ చేయడం, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులు,  తాకట్టు ఆస్తుల విడుదలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీల చట్టం, ఆదాయపు పన్ను చట్టాల ఉల్లంఘనల కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కోరారు. వేలాది బాధిత కుటుంబాలను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి,  కాలేరు ముగిలయ్య,  వజ్రాల అరుణ,  పూర్ణిమ, కొండా రెడ్డి, సుబ్బరాజు, అరుణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: