భద్రాచలం రెడ్ క్రాస్ హాస్పిటల్‌కు అధునాతన పరికరం

భద్రాచలం రెడ్ క్రాస్ హాస్పిటల్‌కు అధునాతన పరికరం

 విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) హాస్పిటల్ సేవలను మరింత విస్తృతపరుస్తూ, రూ. 9.25 లక్షల విలువైన అధునాతన వైద్య పరికరాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిపల్ మంగళవారం ఆ విష్కరించారు. ఈ కొత్త పరికరం ద్వారా రక్త సంబంధిత వ్యాధుల నిర్ధారణలో వేగం, ఖచ్చితత్వం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తలసేమియా ,  సికిల్ సెల్ ఎనిమియా వంటి జన్యు వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సమయానుకూల వైద్య సేవలు అందించడంలో ఈ పరికరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా హెచ్ఐవి, హైపటైటిస్-బి, హైపటైటిస్-సి తదితర ముఖ్యమైన రక్త పరీక్షల ఫలితాలను త్వరితగతిన అందించేందుకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు త్వరిత నిర్ధారణ అందుబాటులోకి రావడం ద్వారా చికిత్సలో ఆలస్యం తగ్గుతుందని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచుకుని, మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ఐఆర్‌సీఎస్ ప్రతినిధులకు సూచించారు. అంధత్వ నివారణ దిశగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంపు, తొలిదశ నిర్ధారణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనిమియా పేషెంట్ల సంక్షేమార్థం నిరంతర రక్త సరఫరా అవసరమని, అందుకోసం సమాజం మొత్తం భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న మానవతా సేవలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఆధునాతన సదుపాయాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకాలు, సహకారానికి ఐఆర్‌సీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా. ఎస్. ఎల్. కాంతారావు ధన్యవాదాలు తెలిపారు. హాస్పిటల్‌లో సేవల విస్తరణకు జిల్లా పరిపాలన నుంచి లభిస్తున్న మద్దతు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీవో బి. రాహుల్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డి. వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, తహశీల్దార్ డి. వెంకటేశ్వర్లు , రెడ్ క్రాస్ సభ్యులు డా. ఎస్. ఎల్. కాంతారావు, వై. సూర్యనారాయణ, జి. రాజారెడ్డి, గోళ్ళ భూపతిరావు, డా. వి. కామేశ్వరరావు, పి. దేశప్ప, బి. హరిశ్చంద్ర నాయక్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags: