కగార్ ఆపరేషన్–2 నిలిపివేయాలి
- మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
విశ్వంభర, హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్–2ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులు గౌరవప్రదంగా జనజీవన స్రవంతిలోకి రావడానికి అనువైన వాతావరణం కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాదు హిమాయత్‌నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యం మార్క్సిజమేనని, అయితే మారిన సామాజిక– రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పోరాట పంథా మారాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన ప్రస్తుత కాలంలో సాయుధ పోరాటం సాధ్యం కాదని, ప్రజాస్వామిక ఉద్యమాలు, ప్రజా పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలే గాని ఎన్‌కౌంటర్లు సమంజసం కాదన్నారు. కక్షసాధింపు ధోరణి మానుకుని మావోయిస్టులకు గౌరవప్రద పునరావాసం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ మాట్లాడుతూ , మావోయిస్టుల సిద్ధాంతాలతో ఏకీభావం లేకపోయినా వారిని శత్రువులుగా చూడడం తగదన్నారు. చట్టప్రకారం వ్యవహరించి, అవసరమైన పరిమితిలోనే బలప్రయోగం చేయాలని సూచించారు. చర్చల ద్వారానే సమస్యకు శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. బండారి రాజ్‌కుమార్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి వామపక్షాలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. చలపతిరావు కగార్–2 పేరుతో నిర్బంధాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రమా జనజీవన స్రవంతిలోకి వచ్చే క్రమంలో ప్రభుత్వ రివార్డులను స్వీకరించరాదని సూచించారు. రమేశ్ రాజా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. జానకి రాములు ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశ్యంతోనే ఆపరేషన్ కొనసాగుతోందని ఆరోపించారు. నారాయణరావు 2024 జనవరి 1 నుంచి కగార్ ఆపరేషన్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయని తెలిపారు. ఈ సమావేశంలో ఈ.టి. నరసింహా, వి.ఎస్. బోస్ తదితరులు పాల్గొన్నారు.



