పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలి
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఏఐఎస్ ఓ వినతిపత్రం
విశ్వంభర, నాంపల్లి : ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతను కచ్చితంగా అమలు చేసి పరీక్షా కేంద్రాల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎస్ ఓ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి పిఆర్ ఓ శ్రీనివాస్ కి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఏఐఎస్ ఓ కన్వీనర్ జి రమేష్ నాయుడు మాట్లాడుతూ, ఇటీవల జియాగూడ, అత్తాపూర్, మెహదీపట్నం, షేక్‌పేట్, అమీర్‌పేట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కొన్ని జూనియర్ కళాశాలలు పరస్పర అవగాహనతో పరీక్షా కేంద్రాలను వినియోగించుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఇది ఇంటర్మీడియట్ నియమావళి ఉల్లంఘన మాత్రమే కాకుండా, విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదకర ధోరణిగా ఆయన అభివర్ణించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో పూర్తిస్థాయి యాదృచ్ఛిక విధానం అమలు చేయాలని, ఒకే యాజమాన్యానికి చెందిన లేదా అనుబంధ కళాశాలలకు సమీప కేంద్రాలు కేటాయించకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరారు.



