ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

విశ్వంభర, పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా  పటాన్ చెరు లో నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని సమష్టి సహకారం, సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదేళ్లపాటు ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని  అతి త్వరలో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులను సైతం అభివృద్ధి పనులకు కేటాయించబోతున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుశంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లొల్ల హరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: