బోడుప్పల్ లో కమిషనర్ క్షేత్ర స్థాయి పర్యటన
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బోడుప్పల్ సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానం, వాటి అవసరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ ,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్ లను కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ రహదారుల రెండు వైపులా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు సూచించారు. అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను సమర్థవంతంగా తొలగించి, అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదనంగా, స్వచ్ఛ ఆటో వాహనాల సంఖ్యను పెంచి ఇంటింటి చెత్త సేకరణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అప్పగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ. ఇ మహేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



