ఇంటర్, 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
- సీఎస్ రామకృష్ణారావు
విశ్వంభర, మహబూబాబాద్: రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్,10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డా బిఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి కార్యదర్శి డా యోగితా రాణా, కృష్ణ ఆదిత్య, నికోలస్ తదితర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, పీఎం శ్రీ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ తదితర అంశాలపై సమీక్షించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరాలు వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని, పకడ్బందీ తనిఖీ అనంతరం విద్యార్థులను కేంద్రాల్లో కి అనుమతించాలని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల వాతావరణం కల్పించాలన్నారు. ప్రత్యేకించి దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, సమగ్ర శిక్షా అభియాన్ అమలు పురోగతిని సమీక్షిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు కృషి చేయాలని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్, విజయలక్ష్మీ, డీఈఓ రాజేశ్వర్, ఇంటర్మీడియట్ అధికారి మదర్, జిల్లా వైద్యాధికారి డా. రవి రాథోడ్, ఆర్టిఓ క్రిష్ణవేణి, ఆర్టీసీ డిఎం తదితరులు పాల్గొన్నారు.



