‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో ఆర్టీసీ టిక్కెట్లు 

‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో ఆర్టీసీ టిక్కెట్లు 

  • డిజిటల్ సేవలకు శ్రీకారం

విశ్వంభర, హైదరాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం ‘మీసేవ మీ టికెట్ మొబైల్’ యాప్‌ ద్వారా బస్ టిక్కెట్ల బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాదు  సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, టీజీఎస్ ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి, మీసేవ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా  ఓ పి ఆర్ ఎస్  సేవలు పూర్తిగా అనుసంధానమై, సుదూర , ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకునే సౌకర్యం లభించనుంది. మొత్తం 1,710 ఓ పి ఆర్ ఎస్ సేవల్లో 450 ఏసీ , 1,260 నాన్ ఏసీ సర్వీసులు ఉన్నాయి. రోజువారీగా సుమారు 13 వేల సీట్లు బుక్ అవుతున్నాయి. బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు టిక్కెట్లు పొందవచ్చు. గ్రేటర్ హైదరాబాదు జోన్ పరిధిలో ఐదు రకాల నెలవారీ సిటీ బస్ పాస్‌లు కూడా ఈ ఆప్ ద్వారా డిజిటల్‌గా పొందే వీలును కల్పించారు. సిటీ ఆర్డినరీ పాస్ రూ.1,400, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,600, మెట్రో డీలక్స్ రూ.1,800, గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ  రూ . 2,200, పుష్పక్ ఏసీ  పాస్ రూ.5,000గా నిర్ణయించారు. నెలవారీగా వేలాది ప్రయాణికులు ఈ పాస్‌లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా జంట నగరాల పరిధిలో 24 గంటల అపరిమిత ప్రయాణానికి అనుమతించే టి 24 డిజిటల్ టికెట్‌ను కూడా ఆప్‌లో విలీనం చేశారు. యాక్టివేషన్ సమయం నుంచి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేయవచ్చు. పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.90, మహిళలు (ఇతర రాష్ట్రాలు)/సీనియర్ సిటిజన్లకు రూ.110గా ఛార్జీలు నిర్ణయించారు. రోజుకు సగటున 16,830 టిక్కెట్లు అమ్ముడవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, సిటీఎం శ్రీదేవి, సీఈ(ఐటి) శ్రీదేవి, హైదరాబాదు,రంగారెడ్డి ఆర్ఎంలు సుధాపరిమళ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Tags: