మీ ఆలోచనే మీ పెట్టుబడి
- వజ్ర ఆటోమేషన్ మాజీ సీఈవో
విశ్వంభర, సంగారెడ్డి: ఒక మంచి ఆవిష్కరణ లేదా ఆలోచననే నేడు పెట్టుబడిగా, మేధో మూలధనంగా పరిగణిస్తున్నారని వజ్ర ఆటోమేషన్ మాజీ కార్యనిర్వహణాధికారి (సీఈవో) జె. శ్రీనివాసరావు చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ ప్యాకేజింగ్ లో అధునాతన ధోరణులు’ అనే అంశంపై ఆయన మంగళవారం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వర్ధమాన ఇంజనీర్లను ఆలోచింపజేసే, అంతర్దృష్టితో కూడిన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. వయస్సు, అనుభవంపై ఆవిష్కరణ ఆధారపడి ఉండదని, ఆలోచనలను ఫలితాలుగా మార్చగల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆశాజనకమైన ఆలోచనలకు నిధులు సమకూర్చడానికి నేడు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని, విద్యార్థులు ఆయా సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, వారి భావనలను మెరుగుపరచడానికి అర్థవంతంగా సంభాషించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ సీహెచ్ సుమంత్ కుమార్, డాక్టర్ ఎన్. శ్యామ్ సుందర్ సాగర్ కన్వీనర్లుగా వ్యవహరించారు. ఈ ముఖాముఖిలో ఈఈసీఈ విద్యార్థులు పాల్గొన్నారు.



