నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?

నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?

  •  సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

విశ్వంభర, రామన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు కనీసం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని రఘరామ ఫంక్షన్ హాలులో జరిగిన సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన జహంగీర్ మాట్లాడుతూ, గత రెండున్నర సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలకు పైసా విదల్చకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడి పోయిందని అన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి చేతులు దులుపుకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు. కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో  గ్రామ పంచాయతీలు కాలం వెల్లదీస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు లక్షల రూపాయలు తమ చేతుల్లో నుండి ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నారని వాపోయారు. గ్రామ సీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న విషయాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ విస్మరిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్ లో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు. ఇప్పటికే పారిశుధ్యం పడకేసి ప్రజా ఆరోగ్యం నిర్వీర్యం అవుతుందని ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కాలయాపన చేయటం సరికాదని అన్నారు. గ్రామ పంచాయతి కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో ఇల్లు గడవని పరిస్థితి నెలకొన్నదని, గత 5 సంవత్సరాలుగా నూతన పింఛన్ ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అనేక మంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు గ్రామ పంచాయతి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. నెలల తరబడి కనీసం కరెంట్ బిల్లులు కట్టలేని దీన స్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, వనం ఉపేందర్, మండల కార్యవర్గ సభ్యులు, మండల కమిటి సభ్యులు, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: