ఆధ్యాత్మిక పుస్తకాలు జీవితం మార్చే మార్గదర్శకాలు
- మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : ఆధ్యాత్మిక పుస్తకాలు జీవితం మార్చే మార్గదర్శకాలుగా నిలుస్తాయని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు వెలువడటం అభినందనీయమని అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూమి బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత సునీత బాలాజీ రాథోడ్ రచించిన హాథిరాం బావాజీ చరిత్ర, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆధ్యాత్మిక పుస్తకాలు కేవలం చదివే గ్రంథాలు మాత్రమే కాకుండా మనసుకు మార్గదర్శకాలు అని తెలిపారు. రోజూ కొద్దిసేపైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఆలోచనలు శుభ్రమవుతాయని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ఈ పుస్తకాలు సహనం, క్షమ, దయ, సేవాభావం వంటి గుణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా నిలబడాలి, ఎలా ఆలోచించాలి అనే దిశగా ఇవి స్పష్టమైన మార్గం చూపిస్తాయని అన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్, బౌద్ధ గ్రంథాలు వంటి ఆధ్యాత్మిక సాహిత్యం మనిషిని బలంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. నిజమైన ఆనందం బయట కాకుండా మన అంతరంగంలోనే ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆధ్యాత్మిక పఠనానికి కొంత సమయం కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కేతువత్ సోములాల్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య చపాడు, డాక్టర్ బెల్లయ్య నాయక్, డాక్టర్ విషరధన్ మహారాజ్, ప్రొఫెసర్ రమణ నాయక్, ప్రొఫెసర్ రాజు నాయక్, బాల్రాజ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.



