రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు భద్రతపై అవగాహన

విశ్వంభర, సిద్దిపేట : ప్రమాదాలను తగ్గించి, ప్రతీ ఒక్కరు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యతని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించొచ్చని చెప్పారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజీవ్ రహదారిపై పొన్నాల ఫ్లైఓవర్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. ప్రతీ వాహనదారుడు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. హైవేలపై ప్రయాణించేటప్పుడు లైన్ డిసిప్లిన్ పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నారు. అజాగ్రత్తగా ఓవర్‌ టేకింగ్  చేయడం ప్రాణాంతకమని, సరైన సంకేతాలు ఇవ్వకుండా దిశలు మార్చవద్దని హెచ్చరించారు. వేగం కన్నా గమ్యం చేరడం ముఖ్యమని, 'అరైవ్ అలైవ్' నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 50ఏండ్ల  వయసున్న ఓ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణించడం గమనించిన ఏసీపీ ఆయనను అభినందించారు. అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

Tags: