ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటానికి దక్కిన విజయం
- తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి
విశ్వంభర, మహేశ్వరం : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సాగుతున్న పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందని, ఇది తెలంగాణ జాగృతి పోరాట పటిమకు దక్కిన విజయమని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు, ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జై తెలంగాణ అని గర్జించిన ఆ ఉద్యమ గొంతుకలు పునరాలోచనలో పడ్డాయని, స్వరాష్ట్ర సాధనతో సంబురపడ్డ ఆ గుండెలకు పుష్కర కాలమైనా ఆశించిన ఆత్మగౌరవం దక్కక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాండురంగారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమకారుల సమస్యలను గాలికొదిలేస్తే బంగ్లా బయటకు గుంజుతారు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన హెచ్చరికతోనే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఒత్తిడి ఫలితంగానే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి ఉద్యమకారుల సమస్యలను వినడం, వారికి తక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తెలంగాణ జాగృతి విశ్రమించదని ఆయన స్పష్టం చేశారు.



