వక్ఫ్ బోర్డు బాధితులకు న్యాయం చేయాలి
- అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన
విశ్వంభర, బోడుప్పల్: వక్ఫ్ బోర్డు పేరుతో తమ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపి వేయడం సరికాదని ఆరోపిస్తూ వక్ఫ్ బోర్డు బాధితులు మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ లో భారి ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.వక్ఫ్ బోర్డు పేరుతో తమ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపి వేయడం సరికాదని ఆరోపిస్తూ వక్ఫ్ బోర్డు బాధితులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఆదివారం బోడుప్పల్ లోనీ వివిధ కాలనీల వాసులు రిజిస్ట్రేషన్ పోరాట సమితి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, చిన్నారులు, కాలనీ సంక్షేమ సంఘాలు నాయకులు పాల్గొన్నారు. 2015 నుండి తమ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసారని దీని వల్ల 10వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు మా సమస్యను గాలికి వదిలేశారని,అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు అనేక మార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కావడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు, ఫ్లాట్లు, ఇళ్లు ఎంతో కష్టపడి కొనుక్కున్నవని కానీ ప్రభుత్వం తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాటిని క్రయ విక్రయాలు చేయకుండా అడ్డుకుని తమ అవసరాల నిమిత్తము కనీసం వాటిని అమ్ముకునే పరిస్థితులు కూడా లేకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.



