ముగిసిన తెలంగాణ మున్సిపల్ పోరు
13న తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవిష్యత్తు
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజాస్వామ్య పండుగ, సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల ఉత్కంఠ మధ్య కొనసాగింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజాస్వామ్య పండుగ, సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. అయితే, ప్రశాంతంగా మొదలైన పోలింగ్ సమయం గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తలెత్తిన వాగ్వాదాలు, ఘర్షణలు చివరకు పోలీసుల జోక్యానికి దారితీశాయి. చాలా చోట్ల రాజకీయ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు పోలింగ్ వాతావరణాన్ని వేడెక్కించాయి.
ఈ ఎన్నికల ప్రచార పర్వం నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. గెలుపు కోసం ప్రతి పార్టీ తమ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం నిర్వహించాయి. అభివృద్ధి హామీల కంటే ప్రత్యర్థులపై విమర్శలు, సవాళ్లు, వ్యక్తిగత ఆరోపణలే ఎక్కువగా వినిపించాయి. తిట్లపురాణం స్థాయికి చేరుకున్న ఈ రాజకీయ పోరులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డుల్లో 12 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 2569 వార్డుల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ జరిగింది. అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 414 వార్డులకు గాను 2 ఏకగ్రీవం కాగా, మిగిలిన 412 వార్డుల్లో ప్రజలు తమ తీర్పును నిక్షిప్తం చేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కరీంనగర్ లో లాఠీచార్జి
అన్ని ప్రాంతాల కంటే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించాయి. కరీంనగర్‌లోని 58వ డివిజన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడం పెను దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సుమారు ఆరుగురు కార్యకర్తల చేతులు విరిగిపోయినట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ సైతం పోలీసుల లాఠీదెబ్బలకు గురికావడం గమనార్హం. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తుంటే, ఫిర్యాదు చేసిన తమపైనే పోలీసులు దాడికి పాల్పడ్డారని బీజేపీ శ్రేణులు జిల్లా పరిషత్ ముందు భారీ నిరసనకు దిగాయి. అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ, ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
దొంగ ఓట్ల బాగోతం బట్టబయలు
మరోవైపు కరీంనగర్ 34వ డివిజన్‌లోని హుస్సేనీపుర సూఫా కాన్వెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్ల బాగోతం బట్టబయలైంది. ఒక స్వతంత్ర అభ్యర్థి తరఫున దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్న ఎండి మొహీబుద్దీన్, ఎండి నజీబుద్దిన్ అనే యువకులను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ ఖాజా మజారుద్దీన్ స్పందిస్తూ, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాల నేపథ్యంలో సదరు బూత్‌లో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు. దొంగ ఓట్ల వెనుక మాజీ రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద, అనేక వివాదాలు, ఉత్కంఠభరిత ఘట్టాల మధ్య ముగిసిన ఈ ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ దిశను ఎలా మారుస్తుందో చూడాలి.



