తెలంగాణ అస్థిత్వ పరిరక్షణకు కార్యాచరణ
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ అస్థిత్త్వాన్ని కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణ అవసరమని సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోవాలని కోరుకునే వర్గాలు, తెలంగాణ వాదుల మధ్య భావజాల ఘర్షణ కొనసాగుతోందని అన్నారు. ఈ సవాల్‌ను ఓపికగా, క్రమబద్ధంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని, దీనికి జయశంకర్ స్ఫూర్తి మార్గదర్శకమని తెలిపారు. డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. అస్తిత్వ భావజాల వ్యాప్తి నిరంతర ప్రక్రియ కావాలన్నారు. వ్యతిరేక వర్గాల వాదనలు కొందరిని ప్రభావితం చేసే అవకాశమున్నందున సమాజంలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. అస్తిత్వ పరిరక్షణ కోసం ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించారు. సీనియర్ జర్నలిస్ట్ పరాంకుశం వేణుగోపాలస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు సమాజం సంక్షోభాన్ని ఎదుర్కొందని, మీడియా బలహీనతతోపాటు రాజకీయ పరిమితుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రొఫెసర్ కే. సీతారాం రావు మాట్లాడుతూ అస్తిత్వ భావజాల ప్రచారం నిరంతరం కొనసాగాలని, నిబద్ధత ఉన్నవారితో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. టాస్క్ కన్వీనర్‌గా డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, కో-కన్వీనర్లుగా హెచ్. రవీందర్, ఎం. సురేష్ కుమార్ నియమితులయ్యారు. ముఖ్య సలహాదారుగా ప్రొఫెసర్ సీతారాం రావు, గౌరవ సలహాదారులుగా టంకశాల అశోక్, పి. వేణుగోపాలస్వామి, జి. వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు. సమావేశంలో పలువురు సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు



