బీజేపీ నాయకుల ఆందోళన
విశ్వంభర, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మెదక్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజాసింగ్ ను విడుదల చేయాలని బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ కు తరలించారు. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాదు నుండి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్తున్నారని సమాచారం అందడంతో మెదక్ డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద ఆదివారం పోలీసులు రాజాసింగ్ అరెస్టు చేసి పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలవడంతో పెద్ద శంకరాపేట మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో పేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి.. రాజా సింగ్ ను విడుదల చేయాలని ధర్నా చేపట్టారు. అనంతరం పెద్ద శంకరంపేట ప్రధాన రహదారిపై అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై హైదరాబాదు నుండి పిట్లం బిచ్కుంద వైపు వెళ్తున్న బస్సు నిలిచి ఉండడంతో ఆందోళన చేస్తున్నవారు పిట్లం బిచ్కుంద బస్సు అద్దంపై చేతితో గుద్దడంతో బస్సు అద్దాలపై కొంచెం పగులు ఏర్పడ్డాయి. అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తుండగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. తాను నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసి పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారని వివరించారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, రేగోడు ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



