రైతుల పక్షాన పోరాడితే అక్రమ కేసులు
- మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
విశ్వంభర, వేల్పూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద చేసిన నిరసన కార్యక్రమాన్ని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 32 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై పెట్టిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు,నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులతో కలిసి పోలి స్టేషన్ కు తరలి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వేములకు ఎస్ఐ సంజీవ్ నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకుని వేముల పోలీసులు పెట్టిన అక్రమ కేసుల పై అసహనం వ్యక్తo చేశారు. నాడు నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. 2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ జరగాల్సి ఉండగా.. కేవలం 22 వేల మందికే చేసి మిగిలిన 30 వేల మందిని మోసం చేశారని విమర్శించారు. 5 సీజన్లకు గాను 3 సీజన్లు రైతు బందు ఎగొట్టారని, వడ్లకు రూ. 500 బోనస్ అరకొరగా వేస్తున్నారని,
కేసీఆర్ పాలనలో ఎరువులు రైతుల ముంగిట ఉండేవని, నేడు యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లు వాడటం రాని రైతులపై యాప్‌ల నిబంధనలు రుద్ది వేధిస్తున్నారని, దుకాణాల్లో దొరికే యూరియాను యాప్ ద్వారా తీసుకొమ్మని వేధిస్తున్నారాని,
షాప్ లో లేని యూరియా యాప్ లో ఉంటుందా అని విమర్శించారు. 2004 డిసెంబర్ 18న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు రాజ్‌భవన్ ముందు రోడ్డుపై కూర్చుని ధర్నా చేసిన ఫోటోను మీడియాకు చూపిస్తూ.. "ఆనాడు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన రేవంత్ రెడ్డిపై లేని కేసులు, అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన మాపై ఎందుకు?"అని డిజిపి ని ప్రశ్నించారు. పోలీస్ మ్యాన్యువల్ ప్రకారం వ్యవహరిస్తామని చెబుతున్న డీజీపీ శివధర్ రెడ్డి ఆనాడు రేవంత్ రెడ్డి చేసిన ధర్నాపై కేసులు నమోదు చేశారా అని ప్రశ్నించారు. కేసులు నమోదు చేస్తే ఆ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చట్టం అనేది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒకలా, ముఖ్యమంత్రికి మరోలా ఉంటుందా అని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
భీమ్గల్‌లో తులం బంగారం ఇవ్వాలని నిరసన తెలియజేస్తే 40 మంది నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. తెలంగాణ కోసం విరోచిత పోరాటము చేసిన విద్యార్ధి ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులకు ఇచ్చిన హామీలు, తులం బంగారం వంటి హామీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



