త్వరలో సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం

త్వరలో సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం

నగరంలోని చారిత్రక సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా నడుం బిగించింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  నగరంలోని చారిత్రక సరూర్ నగర్ చెరువుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా నడుం బిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద చెరువుల పునరుద్ధరణలో భాగంగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం సరూర్ నగర్ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు ప్రస్తుత పరిస్థితి, ఆక్రమణలు మరియు వరద నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చించారు. వచ్చే ఏడాది కాలంలో చెరువు పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేస్తామని, మార్చి నాటికి కీలకమైన పనులు ముగుస్తాయని కమిషనర్ వెల్లడించారు. వర్షాకాలంలో చుట్టుపక్కల కాలనీలు ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువులోకి మురికినీరు నేరుగా చేరకుండా మళ్లించి, కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. చెరువులో పూడిక తీసి, మట్టిని తొలగించడం ద్వారా నీరు భూమిలోకి ఇంకుతుందని, దీనివల్ల స్థానికంగా బోర్లలో నీటి మట్టం పెరుగుతుందని వివరించారు.

ఆక్రమణల ప్రస్తుత పరిస్థితి
చెరువు ప్రస్తుతం 90 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, గతంలో చుట్టుపక్కల ప్రాంతాలు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి ఆ ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని.. తమ ప్రాధాన్యత అంతా చెరువును అభివృద్ధి చేయడం, పూడిక తీయడం మరియు బ్యూటిఫికేషన్ చేయడంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన చెరువులను కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు. సరూర్ నగర్ చెరువును కేవలం ఒక నీటి వనరుగా కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే పూర్తిస్థాయి పనులు ప్రారంభమవుతాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Read More నకిరేకల్ ఎమ్మెల్యే తో రాపోలు భేటీ.  చేనేత సమస్యలపై చర్చ. 

సరూర్ నగర్ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్, సుందరమైన చెట్లతో సుందరీకరణ చేయనున్నట్లు కమిషనర్ తెలపడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మురికి కూపంగా మారుతున్న చెరువుకు మళ్లీ మంచి రోజులు రాబోతుండటంతో పర్యావరణ ప్రేమికులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.