మున్సిపల్ పోరుకు 'కాంగ్రెస్' సై!

ఫిబ్రవరిలో ఎన్నికల నగారా.. సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు

మున్సిపల్ పోరుకు 'కాంగ్రెస్' సై!

తెలంగాణలో రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు మున్సిపల్ పీఠాలపై కన్నేసింది. మేడారం వేదికగా జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 

 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు మున్సిపల్ పీఠాలపై కన్నేసింది. మేడారం వేదికగా జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పట్టణ ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వ్యూహాన్ని రచించారు.

ఎన్నికల వ్యూహకర్తలుగా సీనియర్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక నుంచి, క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి పార్టీని గెలిపించే వరకు అంతా ఈ ఇన్-ఛార్జ్‌లే చూసుకోనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ విజయం కోసం సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం వరకు వీరు పర్యవేక్షించనున్నారు.

Read More డా. వేదాల శ్రీనివాస్ కు  విఎంపి  భారత గౌరవ పురస్కారం

కీలక బాధ్యతలు
ఆదిలాబాద్ జిల్లా పర్యవేక్షకులుగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పార్టీ విజయానికి బాధ్యత వహిస్తారు. మల్కాజ్‌గిరికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్‌బాబులను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు. అలాగే కరీంనగర్ బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకు, వరంగల్‌ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఖమ్మం బాధ్యతలను కొండా సురేఖకు అప్పగించారు. 

వ్యూహం ఏమిటి?
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్, ఈ ఎన్నికల ద్వారా పట్టణ ఓటర్లను కూడా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా మంత్రులు క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలును ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తోంది. మొత్తానికి, ఫిబ్రవరిలో జరగబోయే ఈ 'మినీ సంగ్రామం' తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనుంది. మంత్రుల పర్యవేక్షణలో కాంగ్రెస్ ఏ మేరకు సత్తా చాటుతుందో వేచి చూడాలి.

మూడు రోజుల్లో నోటిఫికేషన్?
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మరో మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.