కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం
తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం వరకు దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ విచారణలో సిట్ బృందం కేటీఆర్ నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఏ4 ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అధికారులు విచారణ కేంద్రానికి రప్పించారు. కేటీఆర్, రాధాకిషన్ రావులను ఒకే గదిలో కూర్చోబెట్టి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి, కేటీఆర్ చెబుతున్న సమాధానాలకు మధ్య ఉన్న పొంతనను అధికారులు నిశితంగా పరిశీలించారు.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం, సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. 2023 ఎన్నికలకు ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఎవరిచ్చారు? దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనం ఏమిటి? ఎస్‌ఐబీ (SIB) అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య వారధిగా ఎవరు వ్యవహరించారు? ఎన్నికల సమయంలో పార్టీ విరాళాల కోసం బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? పార్టీ ఫండ్స్ సేకరించడంలో పోలీసు అధికారుల ప్రమేయం ఎందుకు ఉంది? వంటి అంశాలపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ విచారణను వీడియో రికార్డింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను ఇతర నిందితుల స్టేట్‌మెంట్లతో పోల్చి చూసి, అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు
కేటీఆర్ విచారణ వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్‌ను విచారించడంతో.. ఈ కేసు కేవలం అధికారులకే పరిమితం కాకుండా రాజకీయంగా పెద్దలందరినీ చుట్టుముట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రైవేట్ వ్యక్తుల డేటాను దొంగిలించడం, విపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచడం వంటి అంశాలపై సిట్ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ సీపీ నేతృత్వంలోని బృందం సేకరించిన ఆధారాలు, టెక్నికల్ డేటా ఆధారంగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై స్పష్టత రావడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయా అన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.



