జాతీయ గేయానికి కొత్త గైడ్‌లైన్స్
సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
On
దేశభక్తికి ప్రతీకగా నిలిచే జాతీయ గేయం 'వందేమాతరం' విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర చటర్జీ ఈ అద్భుత గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, జాతీయ గేయానికి మరింత గౌరవాన్ని కల్పించేలా నూతన మార్గదర్శకాలను ప్రకటించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశభక్తికి ప్రతీకగా నిలిచే జాతీయ గేయం 'వందేమాతరం' విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర చటర్జీ ఈ అద్భుత గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, జాతీయ గేయానికి మరింత గౌరవాన్ని కల్పించేలా నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో జాతీయ గీతం 'జనగణమన' కంటే ముందే 'వందేమాతరం' ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
ఆరు చరణాలు.. 3 నిమిషాల 10 సెకన్ల నిడివి
వందేమాతరం గేయ ఆలాపనలో గతంలో ఉన్న సంప్రదాయానికి కేంద్రం స్వస్తి పలికింది. 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించిన అసలైన ఆరు చరణాల గేయాన్ని పూర్తిగా ఆలపించాలని ఆదేశించింది. 1937లో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన నాలుగు చరణాలను తిరిగి చేరుస్తూ, మొత్తం 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగిన గేయాన్ని తప్పనిసరి చేసింది. కేవలం రెండు చరణాలకే పరిమితం కాకుండా, సంపూర్ణ గీతాన్ని పాడటం ద్వారా దేశ వారసత్వాన్ని గౌరవించాలని కేంద్రం పేర్కొంది.
ఎక్కడ ఆలపించాలి? మినహాయింపులు ఏమిటి..
కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. పౌర పురస్కారాల ప్రదానోత్సవాలు, రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఉండాల్సిందే. అలాగే అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ గేయాన్ని తప్పనిసరి చేశారు. సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా దీనిని ప్లే చేయాల్సి ఉంటుంది. అయితే, సినిమా హాళ్లలో గేయం వస్తున్న సమయంలో వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిలబడటం నుంచి మినహాయింపునిచ్చారు.
ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష!
జాతీయ చిహ్నాలను, గీతాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేసిన కేంద్రం, కఠిన నిబంధనలను కూడా అమల్లోకి తెచ్చింది. గేయం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా, వెక్కిరించినా లేదా అగౌరవపరిచినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. అపచారానికి పాల్పడే వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా మార్గదర్శకాల్లో నిబంధనలు చేర్చారు.
రాజకీయ వివాదం.. ఆరు చరణాల వెనుక కథ!
వందేమాతరం ఆరు చరణాల పునరుద్ధరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. 1937లో కాంగ్రెస్ కేవలం రెండు చరణాలకే పరిమితం చేసి భారతీయ సంస్కృతిని విస్మరించిందని బీజేపీ ఆరోపిస్తుండగా, దీనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడిచాయి. నెహ్రూ హయాం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని కేంద్రం ఇప్పుడు మార్చివేస్తూ, చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుతున్నామని ప్రకటించింది.



