మాదాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

మాదాపూర్‌లో హైడ్రా మెరుపు దాడి.. 11 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తన దూకుడును ప్రదర్శించింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని ఖానామెట్ గ్రామ పరిధిలో ఉన్న మొండికుంట చెరువు ప్రాంతంలో భారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ.2,200 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజావాణి ఫిర్యాదుతో కదలిక
మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 53, 55 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వెలిశాయని హైడ్రా ప్రజావాణి ద్వారా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఆక్రమణల నిర్ధారణ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ సేకరించి, ఆక్రమణలను శాస్త్రీయంగా నిర్ధారించారు. గత నెల జనవరి 31న జరిగిన విచారణలో ఆక్రమణదారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలింది.

Read More డిసెంబర్ 25 న చండూర్ లో రాపోలు వీరమోహన్ పర్యటన - చేనేత సమస్యలపై కార్మికులతో సమావేశం. 

వందలాది షెడ్ల కూల్చివేత
భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ ఆపరేషన్‌లో వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను నేలమట్టం చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపి కబ్జాదారులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఇక్కడ మెకానిక్ షెడ్లు, ఐరన్, స్టీల్ దుకాణాలను ఏర్పాటు చేసి నెలకు లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాధితులకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే ఈ కూల్చివేతలు చేపట్టారు.

పర్యాటక కేంద్రంగా మొండికుంట
అక్రమ నిర్మాణాల తొలగింపుపై చుట్టుపక్కల వాసులు హర్షం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ 11 ఎకరాల భూమిలో సుందరమైన పార్కులను నిర్మించాలని, మొండికుంట చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని అధికారులను కోరారు.