భానూర్ గ్రామసభలో రభస
- గ్రామసభలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
- ఉద్రిక్తంగా మారిన సభ
విశ్వంభర, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. జాతీయ గీతాలాపనతో ఘనంగా ప్రారంభమైన ఈ సభ, కాసేపటికే అధికారుల పనితీరుపై గ్రామస్థుల నిరసనలతో హోరెత్తింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని బహిరంగంగానే హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారుల వైఖరిపై రైతులు మండిపడ్డారు. 'రైతుబంధు' నిధులు జమ అయ్యాయని మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తున్నా, బ్యాంకు ఖాతాల్లో మాత్రం పైసా కూడా జమ కాలేదని రైతులు వాపోయారు. సమయానికి యూరియా అందడం లేదని, విద్యుత్ సమస్యలతో పొలాల్లో ఫ్యూజ్‌లు ఎగిరిపోతున్నా సిబ్బంది స్పందించడం లేదని రైతు శంకరయ్య ఫిర్యాదు చేశారు. గ్రామ కంఠంలోని ఇళ్లకు మీటర్లు ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని ఎమ్మెల్సీ తప్పుబట్టారు. గత 40 ఏళ్లుగా భానూర్ భూముల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బీడీఎల్ కంపెనీ వల్ల గ్రామానికి ఎటువంటి ప్రయోజనం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒక స్కూల్ భవనం కట్టి చేతులు దులుపుకున్నారు.. స్థానికులకు ఉద్యోగాలివ్వని ఈ కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేయాలి" అని ఉప సర్పంచ్ ఈగ లత డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేయగా, దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. సర్వే నంబర్ 360లో వాగును ఆక్రమించి కడుతున్న నిర్మాణాలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలకు ప్రమాద బీమా కల్పించడంతో పాటు, ఆర్థికాభివృద్ధి కోసం పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని సూచించారు. ముఖ్యమైన గ్రామసభకు నలుగురు ఎస్సైలు, ఒక సీఐ ఉన్నప్పటికీ ఒక్కరూ హాజరుకాకపోవడంపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, ప్రజలకు అందుబాటులో లేని అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి , కార్యదర్శి రవీందర్ ,వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్ శాంతయ్య , ఉపసర్పంచ్ ఈగ లత, వార్డు సభ్యులు కుమ్మరి గోపాల్, కుమ్మరి పాపయ్య, వడ్ల శ్రీలత శ్రీనివాస్ చారి, టంగుటూరి శ్రీనివాస్, కుమ్మరి ప్రవల్లిక నరేందర్, కుమ్మరి యాదగిరి, పెద్ద సాయనోల్ల సరోజన సత్తయ్య, అంబరి శ్రీనివాస్, ఉట్ల మంజుల, కృష్ణ గౌడ్, రమేష్ నాయక్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
.jpeg)



