ఇందిరమ్మ రాజ్య స్థాపనకే ప్రజా పాలన కార్యక్రమం
- - ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- - రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అధోగతి చేస్తే ప్రగతి వైపు పోతూ ప్రజాసంక్షేమాన్ని అమలు చేయాలని లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల ముందు ఉంచాలనే లక్ష్యంతో 99 రోజులపాటు గ్రామాల్లో ఉన్న సమస్యలన్నిటిని గుర్తించి సమస్యలను పరిష్కరిస్తూ రావడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు హామీలు ఇవ్వని సంక్షేమ పథకాలను సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదవాడు సగర్వంగా బతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలను ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం అందజేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ప్రతి ఏడాది మూడున్నర లక్షల ఇల్లు కట్టే విధంగా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి,ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు నిర్మించిన దాఖలాలు లేవని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద పదివేల కోట్లు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి అందజేయడం జరిగిందని తెలిపారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఐదు లక్షల ఉంటే ప్రస్తుతం 10 లక్షల వరకు పరిమితి పెంచి కార్పొరేట్ హాస్పిటల్లో పేదవానికి వైద్యం అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 100 శాతం మంది నిరుపేదలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. దాంతో పాటు గ్యాస్ సిలిండర్ రూ.500 కి అందజేయడం జరుగుతుందని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రేషన్ కార్డు లేని వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. అదేవిధంగా కొత్త పెన్షన్లను కూడా త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీసుకున్న పంట రుణాలలో రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు.. గత ప్రభుత్వం రైతు భరోసా కింద 5000 సీజన్ కు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరువేలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీ కింద మహిళలకు రుణాలు అందజేయడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ గట్టు జ్యోతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ , సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా, ఎంపీడీవో బాలకృష్ణ,రూరల్ ఎస్సై బాలు నాయక్, వెటర్నరీ డాక్టర్ బి. గోపి, గ్రామ కార్యదర్శి నరసింహారావు, మాజీ ఎంపిటిసి కేశవులు, వార్డు సభ్యులు మహేశ్వరి, శిరీష, పూలమ్మ, శ్రీనివాస్, ఆనంద్, రమేష్, వేణు,తదితరులు పాల్గొన్నారు.



