ఉస్మానియాలో ఘనంగా ‘నాయకత్వ కార్యక్రమం’

ఉస్మానియాలో ఘనంగా ‘నాయకత్వ కార్యక్రమం’

  • ​ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

విశ్వంభర,  ​హైదరాబాద్:  ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన "నాయకత్వ కార్యక్రమం" ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ లక్ష్యాల సాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే దేశానికి గొప్ప నాయకులు అందుతారని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించిన ఆయన, వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సామాజిక బాధ్యతతో పనిచేసే ప్రతి యువకుడికి తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. యువతలో దాగి ఉన్న నాయకత్వ పటిమను వెలికితీయడం, సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన నిర్వాహకులను, విద్యార్థులను మాణిక్ యాదవ్ అభినందించారు. ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వర్సిటీ నాయకులు మరియు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Tags: