కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోంది
- : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
విశ్వంభర, బషీర్ బాగ్: కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుందని, లోక్ సభ, రాజ్య సభలో సీట్లలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబానికి రెండు, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి మూడు సీట్లు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మాదిగలు అంటే అంతా చిన్న చూపా? ఈ విషయంపై భట్టి విక్రమార్క , వివేక్ వెంకటస్వామి స్పందించాలన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదన్నారు. మాదిగలను రాజకీయ శక్తిగా ఎదిగేందుకు "మాదిగ మహా శక్తి" సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మాదిగ ఓట్లు మాదిగలకే వేసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలోని ఉన్నాను. కాంగ్రెస్ లోనే కొనసాగుతాను అని తెలిపారు. మాదిగలకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని నర్సింహులు పేర్కొన్నారు. ఈనెల 5న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాదిగ మహాశక్తి సంఘం జెండా ఆవిర్భావం చేయనున్నట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్, చిలక భాస్కర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.



