ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ కు సిపిఎం వినతి
విశ్వంభర, రామన్నపేట: శిధిలావస్థకు చేరి ప్రమాదపు అంచుల్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు కేటాయించి నూతన భవనం నిర్మించాలని, ఎలాంటి అనుమతులు లేకుండా ఆదాని సిమెంట్ పరిశ్రమ ప్రతిపాదిత స్థలంలో అక్రమ పనులను నిలిపివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందించారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రి గత 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసి ప్రస్తుతం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతుందని, ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదపు అంచుల్లో ఉన్నదని, వెంటనే నూతన భవనానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేసి వంద పడకల ఆసుపత్రిగా చేయాలని, ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెట్టడం జరుగుతుందని అన్నారు. రామన్నపేట అంబుజా అదాని సిమెంట్ పరిశ్రమ నెలకొల్పవద్దని ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలంతా ముక్త కంఠంగా వ్యతిరేకించిగా ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో అడ్డదారిలో పనులు చేస్తున్నారని ఆ పనులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు బల్గూరి అంజయ్య, మండల కమిటి సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు కందుల హనుమంతు, గన్నెబోయిన విజయభాస్కర్, గొరిగే సోములు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శానగొండ రాము, జల్లెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.



