సంక్షేమ పథకాలపై అవగాహన
విశ్వంభర, చెరుకుపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం డిండి మండల చెరుకుపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభను పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సభకు ప్రత్యేకాధికారిగా విచ్చేసిన తహశీల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడిచిన రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తహశీల్దార్ శ్రీనివాస్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు వివరించారు. ముఖ్యంగా రైతు భరోసా, సన్నరకం వడ్లకు బోనస్ వంటి రైతు సంక్షేమ చర్యలు వివరించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై చర్చించారు. త్వరలో అమలు కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి పథకాలను కూడా వివరించారు.సమస్యల గుర్తింపు పరిష్కార దిశగా అడుగులు గ్రామసభలో భాగంగా సమస్యలపై ప్రజలతో నేరుగా చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే తీర్మానాలు చేశారు. ప్రజా సమస్యలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలు తమ విన్నపాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా జీపీ పరిధిలో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో, తహశీల్దార్ హనుమంతు శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ మీసాల రామచంద్రయ్య, స్థానిక జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెడ్మాస్టర్ ఇస్లావత్ గోప్య నాయక్, ఎస్.ఐ బాలకృష్ణ, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



