ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
విశ్వంభర, నిజామాబాద్ : పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందలవాయి మండలం మల్లాపూర్ గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దర్శనం మోహన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు, మున్ముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి, గ్రామ సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని తెలిపారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ఒక్కో పథకం వారీగా అధికారులు పేర్లను ప్రకటించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత పథకం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు తదితర వాటి ద్వారా గ్రామంలో లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి గ్రామసభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, అంగన్వాడి, ఆశ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.



