రాష్ట్రంలో బీర్ల సంస్థ భారీ పెట్టుబడి

రాష్ట్రంలో బీర్ల సంస్థ భారీ పెట్టుబడి

ప్రపంచంలోనే అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ (AB InBev) తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ (AB InBev) తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం, ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‍తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ యూనిట్‌ను విస్తరించేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్, తాజా విస్తరణ ద్వారా మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురానుంది.

ఇప్పటికే ఈ సంస్థ ద్వారా దాదాపు 600 మందికి ఉపాధి లభిస్తుండగా, విస్తరణతో మరిన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి. కేవలం పరిశ్రమలే కాకుండా.. సర్క్యులర్ వాటర్ వినియోగం, మహిళా సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కంపెనీ ఆసక్తి చూపింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ విజన్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల కల్పన కీలకమని తాము భావిస్తున్నామని చెప్పారు. ఏబీ ఇన్‌బెవ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం శుభపరిణామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read More రవీంద్ర భారతిలో ఘనంగా పుస్తక ఆవిష్కరణల సభ 

పెట్టుబడిదారుల నమ్మకం
తెలంగాణలో ఉన్న విధాన స్థిరత్వం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు వ్యాపార సౌలభ్యం కారణంగానే అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏబీ ఇన్‌బెవ్ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. అటువంటి దిగ్గజ సంస్థ తెలంగాణలో తన సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించనుంది.