Prabhakar Rao: కస్టడీ అవసరమా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!!
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుపై కొనసాగుతున్న దర్యాప్తు తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుపై కొనసాగుతున్న దర్యాప్తు తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండు వారాల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన కోర్టు, “ఇంకెంతకాలం ఇంటరాగేషన్ కొనసాగించాలనుకుంటున్నారు? ఈ దర్యాప్తులో ఇంకా ఏమి మిగిలి ఉంది?” అంటూ దర్యాప్తు సంస్థను నేరుగా ప్రశ్నించింది.
ప్రభాకర్ రావు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయస్థానం, ప్రభుత్వ ఉద్దేశాలపై కూడా స్పష్టత కోరింది. మీ లక్ష్యం ఇప్పటికే పూర్తయ్యిందా? లేక మళ్లీ ఆయనను జైలుకు పంపాలనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయబడినంత మాత్రాన విచారణకు పిలవకూడదన్న అర్థం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు అవసరమైతే ఆయనను తిరిగి పిలిచి ప్రశ్నించవచ్చని, ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరిస్తారని కూడా కోర్టు అభిప్రాయపడింది.
కేసు పురోగతిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ జరిగే వరకు ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన మధ్యంతర రక్షణను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 10కు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు దశలో అధికారుల బాధ్యతలు, కస్టడీ అవసరంపై కీలక సూచనలుగా మారాయని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



