పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ప్రజలు ఆశించిన మార్పును క్షేత్రస్థాయిలో సాధించి చూపామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ప్రజలు ఆశించిన మార్పును క్షేత్రస్థాయిలో సాధించి చూపామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖకు సంబంధించిన ఆధునీకరించిన వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. గత రెండేళ్లలో వివిధ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావించారు.
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంస్కరణలు, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
దేశానికే ఆదర్శం.. ప్రపంచ స్థాయి లక్ష్యం
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ నేడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సంస్కృరణలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేవలం దేశంలోనే కాకుండా, ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శ్రమిస్తోందని వివరించారు.
డిజిటల్ సమాచారం ప్రజలకు చేరువగా..
సమాచార శాఖ వెబ్‌సైట్‌ను ఆధునీకరించడం ద్వారా ప్రభుత్వ పథకాలు, జీవోలు, తాజా సమాచారాన్ని ప్రజలకు, మీడియాకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వెబ్‌సైట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



