ప్రయివేట్ స్కూల్ లో అగ్ని ప్రమాదం
- సెలవు కావడంతో విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
విశ్వంభర, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రద్ధ స్కూల్ లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే స్కూల్ భవనం మొత్తానికి వ్యాపించాయి. మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తు ఈరోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కు సెలవు ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. మంటల కారణంగా స్కూల్ లోని ఆఫీస్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. విద్యార్థుల తరగతి గదులు, ఫర్నిచర్, పుస్తకాలు, ముఖ్యమైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. పొగలు ఆకాశాన్ని తాకేలా వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



